అల్లూరి సీతారామరాజు చరిత్ర – History of Alluri Sitaramaraj

అల్లూరి సీతారామరాజు చరిత్ర – History of Alluri Sitaramaraj

 

అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర ఉద్యమంలో చేసిన పోరాటం  భారత స్వాతంత్ర చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయం అని చెప్పవచ్చు. సాయుధ పోరాటం ద్వారానే  స్వతంత్రం వస్తుందని నమ్మి, దాని కొరకే ప్రాణాలు అర్పించిన యోధుడు. కేవలం 27 సంవత్సరాల వయసులోనే బ్రిటీషు సామ్రాజ్యంతో పోరాడిన యోధుడు.

 

అల్లూరి సీతారామరాజు  1897 జులై-4 న ఇప్పటి పశ్చిమగోదావరి జిల్లాలోని మోగల్లు,  అయిన విజయనగరం దగ్గర పాండ్రంగిలో తాతగారైన మందలపాటి శ్రీరామరాజు ఇంట జన్మించారు. సీతారామరాజును చిన్నపుడు చిట్టిబాబు ముద్దుగా పిలుచుకునేవారు. సీతారామరాజు పుట్టిన తరువాత సీతమ్మ అనే చెల్లెలు, సత్యనారాయణ రాజు అనే తమ్ముడు పుట్టారు. 

అల్లూరి సీతారామరాజు బాల్యం మరియు జీవితం

 

రామరాజు తల్లిపేరు సూర్యనారాయణమ్మ, తండ్రి పేరు వెంకటరామరాజు. సీతారామరాజు 6 వ తరగతి చదువుతున్న వయసులోనే అతని తండ్రి చనిపోవడం జరిగింది. 1908లో గోదావరి పుష్కరాల సందర్బంగా కలరా వ్యాధికి గురై సీతారామరాజు తండ్రి మరణించారు. రాజు తండ్రి అప్పట్లో మంచి ఫొటోగ్రాపర్. చిన్న వయసులోనే తండ్రిని కోల్పవడంతో సీతారామరాజు జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. ఆదాయం లేక, పేదరికం కారణంగా రాజు కుటుంబం అష్టకష్టాలు పడింది. రాజు కుటుంబం స్థిరంగా ఒకచోట ఉండలేక వివిధ ప్రదేశాలకు వెళ్లి నివసించవలసి వచ్చింది. పిన తండ్రి  రామకృష్ణంరాజు  ఆర్థికంగా ఆ కుటుంబాన్ని ఆదుకునేవాడు. తండ్రి మరణం  సీతారామరాజు చదువు పై కూడా ప్రభావం చూపింది. 
సీతారామరాజు కుటుంబం 1909లో భీమవరం దగ్గర కొవ్వాడ గ్రామానికి నివాసం మార్చారు. అక్కడి నుంచి అనేక ప్రాంతాలు మారుతూ అతని విద్యాభ్యాసం సాగుతూ వచ్చింది. 
రాజు కుటుంబం 1918 వరకు తునిలోనే ఉంది. ఆ కాలంలోనే చుట్టుపక్కల కొండలు, అడవుల్లో తిరుగుతూ, గిరిజనుల జీవన విధానాన్ని గమనిస్తూ ఉండేవాడు. ఈ సమయంలోనే సీతారామరాజు ధారకొండ, కృష్ణ దేవిపేట మొదలైన ప్రాంతాలు చూసాడు. 
అల్లూరిసీతారామరాజులో చిన్నపటి నుండి దైవభక్తి, న్యాయకత్వ లక్షణాలు, దాన గుణం అధికంగా ఉండేవి. తుని సమీపంలో పెద్ద తల్లి ఉన్న గోపాల పట్టణంలో సీతమ్మ కొండపై రామలింగేశ్వరాలయంలో కొంతకాలం తపస్సు చేసాడు. తన మిత్రుడు పేరిచర్ల సూర్యనారాయణ రాజుతో కలసి మన్యం ప్రాంతాలలో పర్యటించేవాడు. కొండలపైన, దేవాలయాల్లో, శ్మశానాలలో రాత్రి పూట ధ్యానం చేసేవాడు. 
సీతారామరాజు ఉత్తరదేశ యాత్రలు చేసి అనేక యుద్ధ విద్యల్లోను, ఆయుర్వేద వైద్య విద్యలోనూ ప్రావీణ్యుడవడంచేత చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ఆరాద్యుడయ్యాడు. ముఖ్యంగా మన్యం ప్రజల కష్టాలను తీర్చడానికి ప్రయత్నాలు చేసేవాడు. అక్కడి ప్రజలకు మూలికా వైద్యం  మరియు రామాయణ భారత భాగవత కథలు వినిపించడం వంటివి చేసేవాడు.  1918 ప్రాంతంలో కొంగసింగిలో ఒక మోదుగ చెట్టు కింద మండల దీక్ష కూడా నిర్వహించాడు. 

సీతారామరాజు కాలంలో బ్రిటీష్ అధికారుల దురాగతాలు 

 

ప్రజలు బ్రిటీష్ వారి  చేతిలో అనేక దురాగతాలకు, దోపిడీలకు, అన్యాయాలకు గురయ్యేవారు. శ్రమదోపిడి, ఆస్తుల దోపిడీ, స్త్రీల మానాలను తీయడం వంటి దురాగతాలు చేసేవారు. పోడు వ్యవసాయం చేసుకుంటూ, అటవీ ఉత్పత్తులను సేకరించి వాటిని అమ్ముకొని జీవించే వారిపై   బ్రిటీషు వారు ఘోరమైన దురాగతాలు చేసేవారు. అడవిలో చెట్లను కొట్టడాన్ని నిషేధించి గిరిజనులకు జీవనాధారం లేకుండా చేసింది బ్రిటీషు ప్రభుత్వం. అటవీ ఉత్పత్తుల సేకరణలో కూడా అడ్డంకులను సృష్టించింది. 
బ్రిటీషు ప్రభుత్వం నిర్మిస్తున్న  రోడ్ల క్రాంట్రాక్టర్ల వద్ద గిరిజనులు రోజు కూలీలుగా పనిచేయవలసి వచ్చింది. వీరికి కాంట్రాక్టర్లు తగినంత కూలీ ఇచ్చేవారు కాదు. గిరిజనులు  ఆకలి మంటలను తట్టుకోలేక చింత అంబలిని తాగి బతికేవారు. దానివలన కడుపులో అల్సర్లు వచ్చేవి. దీనికి తోడు అధికారులు, కాంట్రాక్టర్లు వీరి పట్ల అమానుషంగా ప్రవర్తించేవారు. అధికారులు అడవుల్లో ప్రయాణించాల్సి వచ్చినపుడు గిరిజనులు వారిని ఎత్తుకొని తీసుకొని వెళ్ళవలసి వచ్చేది. గిరిజన స్త్రీలపై, అత్యాచారాలు కూడా చేసేవారు. అయినా ఏమి చేయలేని స్థితిలో గిరిజనులు ఉండేవారు. వీటిని సహించలేని కొంతమంది గిరిజనులు కొన్ని ప్రాంతాల్లో తిరుగుబాటు చేశారు. వీరినే పితూరీ అని పిలిచేవారు. ఇలా ఏర్పడినదే లంగరాయి పితూరీ కూడా. దీనికి నాయకుడు వీరయ్య దొర. ఇతనిని ప్రభుత్వం రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్ లో బంధించింది. 

మన్యం ప్రజలలో అల్లూరి సీతారామరాజు తెచ్చిన చైతన్యం 

అల్లూరి సీతారామరాజు మన్యం ప్రజలు పడే కష్టాలను తీర్చడానికి, తెల్ల దొరల దోపిడీని ఎదుర్కోవడానికి గిరిజనులకు అండగా నిలిచి పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాడు. మన్యం ప్రజలలో ధైర్యాన్ని నింపి, వారి హక్కులను వివరించి, అన్యాయాలను ఎదురించే విధంగా తయారు చేసాడు. ఈ విధంగా సీతారామరాజు అనేక గ్రామాల ప్రజలకు నాయకుడయ్యాడు. ప్రజలు అతని వద్దకు సలహాలు మరియు వివాద పరిస్కారాల కోసం వచ్చేవారు. ప్రముఖంగా సీతారామరాజు మన్యం లోని గిరిజనులను సమీకరించి వారిలోని దురలవాట్లను దూరం చేసాడు. 
వారికి యుద్ధ విద్యలను, గెరిల్లా యుద్ధపద్దతులను నేర్పించి  పోరాటానికి సిద్ధం చేయసాగాడు. రామరాజు అనుచరుల్లో గాము గంటందొ ర, గాము మల్లుదొర, కంకిపాటి ఎండు పడాలు  ప్రధానమైన వారు. 
గిరిజనులపై దోపిడీ చేసిన బ్రిటీషు అధికారులలో చింతపల్లికి తహసీల్దారు అయిన బాస్టియన్ అత్యంత క్రూరుడు. నర్సీపట్నం నుండి లంబసింగి వరకు రోడ్డు మార్గాన్ని నిర్మించే క్రాంట్రాక్టరుతో కుమ్మక్కై, కూలీలకు సరైన కూలీ ఇవ్వక, ఎదురు తిరిగిన వారిని కొరడాలతో కొట్టించేవాడు. సీతారామరాజు దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసాడు. ఇతని ఫిర్యాదుపై బ్రిటిషు ప్రభుత్వం ఎటువంటి చర్యను తీసుకోలేదు. తనపై ఫిర్యాదు చేసాడనే కోపంతో బాస్టియన్ ప్రభుత్వానికి నివేదికను పంపాడు. ఆ నివేదికలో ఏమి రాశాడంటే, సీతారామరాజు గిరిజనులను కూడకట్టుకొని విప్లవాన్ని తీసుకొచ్చే సన్నాహాల్లో ఉన్నాడని అందులో పేర్కొన్నాడు. 
అప్పటికే గిరిజనుల్లో కలుగుతున్న చైతన్యాన్ని గమనించిన ప్రభుత్వం సీతారామరాజును గిరిజనులకు దూరంగా ఉంచాలని చూసింది. నర్సీ పట్నంలో కొన్నాళ్ళు, అడ్డు తీగల సమీపంలో పైడిపుట్టిలో కొన్నాళ్ళు ప్రభుత్వ అధికారుల కనుసన్నలతో ఉంచింది. పైడిపుట్టిలో రామరాజు  కుటుంబంతో సహా ఉండేవాడు. అనునిత్యం ఇతనిపై పొలిసు వారి నిఘా ఉండేది. సీతారామరాజుకు ఇది ప్రవాస శిక్ష లాంటిది. పోలవరంలో డిప్యూటీ కలెక్టరుగా పనిచేస్తున్న ఫజులుల్లా ఖాన్ అనే వ్యక్తి సహకారంతో ఈ ప్రవాస శిక్షను తప్పించుకొని సీతారామరాజు మళ్ళీ 1922 జూన్ నెలలో మన్యంలో కాలు పెట్టాడు. దీనితరువాత ఇతని విప్లవానికి వేదిక సిద్ధమైంది. ఈ విధంగా సీతారామరాజు రెండు విప్లవ దశలను పూర్తి చేసాడు. 

అల్లూరి సీతారామరాజు మరణం

మాన్యానికి కొత్త కలెక్టరుగా (స్పెషల్ కమిషనర్) రూథర్ ఫర్డ్ 17-4-1924 న నియమించబడ్డాడు. ఇతను విప్లవాలను అణచడంలో నిపుణుడని పెద్ద పేరు ఉంది. అల్లూరి సీతారామురాజు యొక్క విప్లవకారులలో అగ్గిరాజు అతి సాహసవంతుడిగా పేరు సంపాదించాడు. ఆ రోజుల్లో బ్రిటీషు అధికారులను,  పొలిసు వారిని ముప్పతిప్పలు పెట్టడంలో ఇతను మొదట ఉండేవాడు. ఆహార ధాన్యాలను కొల్లగొట్టేవాడు, విప్లవానికి చేటు చేసే ద్రోహులను దారుణంగా శిక్షించేవాడు. ఇతని ప్రాణ భయం అనేది ఉండేది కాదు. ఆ తరువాత 1924లో మే 6 తేదీన జరిగిన కాల్పుల్లో అతని కాలికి పెద్ద గాయం ఏర్పడింది. బ్రిటీషు వారికి దొరక్కుండా బావిలో దూకి చనిపోవాలని పాక్కుంటు వెళుతున్నప్పుడు కొందరు సైనికులు అతనిని చూసి పట్టుకున్నారు. ఆ తరువాత అతనిని శిక్షించి, అప్పట్లో ఏంటో భయంకరమైన అండమాన్ జైలుకి అతనిని పంపారు. ఆ తరువాత కొన్ని సంవత్సరాలకి భయంకరమైన శిక్షలు అనుభవిస్తూ అండమాన్ జైలులోనే చనిపోయాడు. ఆ యుద్ధంలో ఆరోజు రాత్రి రామరాజు కూడా ముంప  అనే గ్రామానికి చివరగా వచ్చి చేరుకున్నాడు. అంతకు ముందు బ్రిటీష్అధికారి అయిన రూథర్ ఫర్డ్ ఆ కృష్ణదేవ పేటలోని ఒక పెద్ద సభను నిర్వహించాడు. సభకు ఆ గ్రామం యొక్క మునసబు కూడా హాజరయ్యాడు. ఈ సభలో రూథర్ ఫర్డ్ వారం రోజుల్లోగా రామరాజుదళం యొక్క విప్లవకారుల ఆచూకీ తెలుపకపోతే గ్రామంలోని ప్రజలను కాల్చి వేస్తామని చాలా భయంకరంగా హెచ్చరించి వెళ్ళాడు.  కృష్ణ దేవ పేటలో రూథర్ ఫర్డ్ ఏమి చెప్పాడో తెలుసుకుందామని రామరాజు మునసబు ఇంటికి ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగా వెళ్ళాడు. అక్కడ ఏమి జరిగిందో తెలుసుకొని ప్రజలందరూ తనవల్ల భాదపడకూడదని, మరుసటిరోజు బ్రిటీషు వారికి లొంగిపోతానని మునసబుకి చెప్పాడు. 
ఆ రోజుల్లో సీతారామరాజును పట్టించి ఇచ్చిన వారికి రూ.10,000 బహుమానం  ఇస్తామని ప్రకటించారు. అందువల్ల తనను ప్రభుత్వానికి పట్టించి ఆ బహుమతిని తీసుకోమని గ్రామానికి  మేలు జరిగే విధంగా ఖర్చుపెట్టమని ఆ మునసబుని ఎంతో బ్రతిమలాడాడు. కానీ ప్రజల కోసం పోరాడుతున్న రామరాజుని బ్రిటీషు వారికి పట్టి ఇవ్వడానికి మునసబు మనషు ఒప్పుకోలేదు. ఇటువంటి నీచమైన పనిని నేను చేయను కావాలంటే నువ్వు చేసే యుద్ధంలో యుద్ధంలో నేను కూడా చనిపోతానని చెప్పాడు. ఆ తరువాత సీతారామరాజు బ్రిటీష్ ప్రభుత్వానికి లొంగిపోతాననని ఎంత ప్రయత్నించినా గ్రామంలో ఎవ్వరు ఒప్పుకోలేదు. 
1924 మే 7వ తేదీన కొయ్యురు గ్రామంలోనే ఒక ఏటి వద్ద సీతారామరాజు కూర్చొని అక్కడ ఉండే ఒక పశువుల కాపరి ద్వారా తాను ఉన్న చోటును పొలిసు వారికి తెలియచేసాడు. ఈ విషయం తెలుసుకున్న బ్రిటీషు పోలీసులు సీతారామరాజును పట్టుకోవడానికి బయలుదేరారు. వారు తనని పట్టుకోవడానికి వస్తారని తెలిసి సీతారామరాజు ఏట్లో స్నానం చేస్తుండగా పోలీసులందరు కలిసి సీతారామరాజును బంధించారు. కొయ్యురు లో విడిది చేసిన బ్రిటీష్ మేజేర్ గుడాల్ వద్ద సీతారామరాజును హాజరుపరిచారు. బందీగా ఉన్న సీతారామరాజును ఎటువంటి విచారణ జరపకుండా ఒక చెట్టుకు కట్టేసి గుడాల్ తన తుపాకీతో ఎన్నో సార్లు కాల్పులు జరుపుతు అతన్ని కాల్చి వేసాడు. సీతారామరాజు మరణ వార్తని అతని తల్లికి కూడా తెలియచేయలేదు.  మే 8వ తేదీన బ్రిటీష్ వాళ్ళ యొక్క  పై అధికారులకు  సీతారామరాజు మరణ వార్తను తెలియచేయడానికి  మేజర్ గుడాల్ సీతారామరాజు  మృతదేహాన్ని ఫోటో తీయించి తరువాత రామరాజు శవాన్ని దహనం చేశారు. దహన కార్యక్రమము అయిన తరువాత సీతారామరాజు చితా భస్మాన్ని సమీపంలో ఉన్న వరాహ నదిలో కలిపేశారు. ఈ విధంగా కేవలం 27 ఏళ్ళ  వయసులోనే బ్రిటీషువారిని గడ, గడలాడించి  భారతదేశం కోసం అమరవీరుడయ్యాడు.  

telugudiscovery.com

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *